: మా దేవాన్ష్ ని 'తాతకు ముద్దుపెట్టు' అంటే, పేపర్లో ఉన్న నాన్న ఫోటోకు ముద్దుపెట్టాడు!: లోకేష్
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన జన చైతన్య యాత్రలో టీడీపీ నేత లోకేశ్ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. 'మొన్నా మధ్య నాన్న హైదరాబాద్ వచ్చారు. తాతను ముద్దుపెట్టుకోమని మా అబ్బాయి దేవాన్ష్ తో బ్రహ్మణి చెప్పింది. వెంటనే దేవాన్ష్ అక్కడే ఉన్న పేపరు తీసుకుని అందులో ఉన్న నాన్న ఫొటోకు ముద్దు పెట్టాడు. దానిని చూసిన నాన్న, 'ఇదేంటి, నేను ఎదురుగా ఉంటే ఫొటోను ముద్దుపెట్టుకున్నాడు' అని అడిగారు. ‘రోజూ పేపరు ఇచ్చి.. ఇదిగో తాతయ్య’ అని చూపిస్తున్నామని, అందుకే ఎదురుగా ఉన్న మిమ్మల్ని కాకుండా పేపరులో ఫొటోను ముద్దు పెట్టుకున్నాడని సమాధానమిచ్చిందని అన్నారు. దీంతో ఆయన మనసు చివుక్కుమందని, కుటుంబానికి దూరమయ్యానని బాధ పడ్డార'ని చెప్పారు. అంతలోనే తేరుకుని, దేవాన్ష్ ను ముద్దాడి, ఈ కష్టాన్ని భరించేది రాష్ట్రం, ప్రజల కోసమే కదా అన్నారని ఆయన తెలిపారు.