: నిలబడతారా? తడబడతారా?...తొలి ఇన్నింగ్సే ఆసక్తికరం!
టీమిండియా ఊహించని ఆటతీరుతో ఇంగ్లండ్ ఆకట్టుకుంది. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లిష్ జట్టు భారత్ ఊహించని ప్రదర్శన చేసింది. స్వదేశంలో టీమిండియా పులి అని, భారత్ ను భారత్ లో ఒడించడాన్ని విదేశీ జట్లన్నీ గర్వంగా భావిస్తాయి. అయితే, గతంలో ఇంగ్లండ్ జట్టు టీమిండియాకు షాక్ ఇచ్చింది. భారత్ తో సిరీస్ కు ముందు బంగ్లాదేశ్ లో ఆడి, ఉపఖండ పిచ్ లపై మంచిపట్టు సాధించిన కుక్ సేన, భారత్ ను భారత్ లో దీటుగా ఎదుర్కొంది. టీమిండియా బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఇంగ్లిష్ ఆటగాళ్లు భారీ స్కోరు సాధించారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆటగాళ్ల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. బౌలర్లు కలిసికట్టుగా విఫలమయ్యారు. కివీస్ పై చూపించిన జోరు ఇక్కడ చూపించలేకపోయారు. బ్యాటింగ్ పిచ్ అయిన రాజ్ కోట్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు అవకాశాలు కల్పించుకోవడంలో విఫలమయ్యారు. దీంతో భారం మొత్తం బ్యాట్స్ మన్ పై పడింది. ఇంగ్లండ్ పేసర్లే ఆయుధంగా బరిలోకి దిగింది. వారికి దీటుగా సమాధానమివ్వాలని టీమిండియా ఆటగాళ్లు కూడా భావిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ పై కన్నేస్తే టాప్ ఆర్డర్ ఏ మాత్రం విఫలమైనా టెస్టు చేజారే ప్రమాదం కనిపిస్తోంది. ఓపెనర్లు గంభీర్, విజయ్ సీనియర్లు. వీరిద్దరూ నిలదొక్కుకుంటే ప్రత్యర్థులకు ఇబ్బందే. అనంతరం పుజారా, కోహ్లీ, రహానేలు మాత్రమే భారీ స్కోర్లు సాధించగల, ప్రత్యర్థులకు ఎదురొడ్డగల సమర్థులు. వీరు విఫలమైతే, తరువాత ఆర్డర్ లో వచ్చే అశ్విన్, సాహా, జడేజా జట్టు స్కోరు పెంచగల సమర్థులే. తరువాత వచ్చే టెయిలెండర్లు షమి, ఉమేష్ యాదవ్, అమిత్ మిశ్రాలపై పెద్దగా నమ్మకం పెట్టుకునే అవకాశం లేదు. దీంతో తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్ నే ఇంగ్లండ్ జట్టు ఆసక్తికరంగా మార్చింది. రేపు టీమిండియా సమర్థవంతంగా ఆడగలిగితే మ్యాచ్ డ్రాగా ముగియనుంది. లేని పక్షంలో భారత్ కు కఠినపరీక్ష ఎదురవుతుంది.