: అమెరికన్లకు నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేనట్టుంది!: ముస్లిం మహిళా జర్నలిస్టు ఆవేదన


ట్రంప్ విజయానంతరం అమెరికన్ల భావోద్వేగాలను దగ్గర్నించి గమనించిన ఓ అఆమేరికన్ ముస్లిం మహిళా జర్నలిస్టు వ్యక్తం చేసిన భావన అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె భావనను 'హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్ పేజ్' ప్రచురించింది. దీంతో ఇది వైరల్ గా మారింది. ఈ పోస్టును నాలుగు లక్షలమందికి పైగా లైక్ చేయగా, 60 వేల మంది షేర్‌ చేసుకుంటే, 17 వేల కామెంట్లు వచ్చాయి. ‘ఒక జర్నలిస్టుగా నేను ట్రంప్‌ సభలను ఎన్నింటినో కవర్‌ చేశాను. అయితే నేనెప్పుడూ విద్వేషాన్ని ఎదుర్కోలేదు. ట్రంప్ సభలకు హాజరవుతున్న నన్ను ప్రజలు ఆసక్తిగా చూసేవారు. కానీ ఎన్నడూ నాపై దాడి చేయలేదు. రాజకీయాలతో ప్రజలు ఎంతో విసిగిపోయారు కాబట్టి, ఆయనకు చాలామంది అమెరికన్లు అండగా నిలబడ్డారని నాకు అనిపించింది. అయినప్పటికీ కొన్నిసార్లు అనుమానంగానే ఉండేది. నన్ను చాలామంది ద్వేషించకపోయినా, నన్ను దేశం నుంచి బహిష్కరించాలని పేర్కొన్న వ్యక్తికి ఎందుకు అండగా నిలుస్తున్నారో అర్థం కావడం లేదు. నా ప్రియమైన స్నేహితుడి తండ్రి కూడా ట్రంప్‌ కు మద్దతుదారుగా ఉండేవారు. ఒకసారి థాంక్స్‌ గివింగ్‌ పార్టీ సందర్భంగా అతనితో కలిసి నేను వారింటికి వెళ్లాను. అప్పుడు నా స్నేహితుడు...‘నాన్న! ఈ వ్యక్తి (ట్రంప్) కి నువ్వెలా మద్దతిస్తావు? మన స్నేహితురాలైన జహ్రా ముస్లిం అన్న సంగతి నీకు తెలుసు కదా?’ అని అడిగాడు. దానికి ఆయన బదులిస్తూ...‘ఆందోళన చెందాల్సిందేమీ లేదు. ట్రంప్‌ చెప్పినవన్నీ చేయబోడు’ అని అన్నారు. కానీ ఈ రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలామంది అమెరికన్లు ట్రంప్‌ కు మద్దతిస్తున్నారన్న అభిప్రాయం తప్పేమోనని అప్పట్లో నాకు అనిపించేది. కానీ ఇప్పుడు నాకు ఆ ఆశ కూడా లేకుండాపోయింది. నేనిక్కడ ఉండటం అమెరికన్లకు ఇష్టం లేదేమోనన్న భావన బలపడుతోంది. ఎంతో కష్టపడినా నేను ఇక్కడి సమాజంలో భాగం కానేమోనని, అమెరికా కేవలం శ్వేతజాతీయులకు చెందినదేమోనని బలంగా అనిపిస్తున్నది" అని ఆమె పేర్కొంది. ఇదిప్పుడు అక్కడ వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News