: ప్రత్యేక హోదా, నోట్ల రద్దుపై ఏకంగా గంటన్నర సేపు మాట్లాడనున్న పవర్ స్టార్
నేటి సాయంత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అనంతపురం ప్రభుత్వ కళాశాల వేదికగా చేయనున్న ప్రసంగంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇటీవల ఆయన కాకినాడ వేదికగా ప్రసంగిస్తూ, రెండు పాచిపోయిన లడ్డూలు కేంద్రం ఇచ్చిందని చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరదీసిన సంగతి తెలిసిందే. ఇక నేడు కూడా ఆయన ప్రత్యేక హోదాపైనే మాట్లాడనున్నారని సమాచారం. దాదాపు గంటన్నర పాటు ఆయన ప్రసంగం సాగుతుందని, హోదాతో పాటు పెద్ద నోట్ల రద్దు అంశంపైనా పవన్ తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే అనంతపురం పట్టణం జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులతో కిక్కిరిసి పోతోంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సభ ముగిసిన గంటసేపటి వరకూ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని, ప్రజలు సహకరించాలని పోలీసు అధికారులు కోరారు.