: 'పెద్దనోట్ల రద్దు' ఎఫెక్ట్: తగ్గిన దొంగతనాలు.. కొట్టేసిన డబ్బులను వెనక్కి ఇచ్చేస్తున్న దొంగలు


మోదీ సంచలన ప్రకటన దొంగల్లో పరివర్తన తీసుకొచ్చిందా? పరివర్తన సంగతి ఏమో గానీ, పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ రెండు రోజుల్లో దొంగతనాలు మాత్రం గణనీయంగా తగ్గాయి. జేబు దొంగతనాలు అయితే దాదాపు ఆగిపోయాయి. అక్కడక్కడా కొందరు పర్సులు కొట్టేసిన దొంగలు అందులోని నోట్లను తీసి మర్యాదగా తిరిగి యజమానులకు అప్పజెబుతున్నారు. మంగళవారం రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రకటించిన తర్వాత గ్రేటర్ నోయిడాలో ఓ పర్సు దొంగతనం జరిగింది. ఓ వ్యక్తి జేబులోని పర్సును కొట్టేసిన దొంగలు అందులోని రూ.500 నోట్లను చూసి కంగుతిన్నారు. అవి అప్పటికే రద్దవడంతో ఏం చేయాలో పాలుపోని వారు తిరిగి పర్సు యజమాని వద్దకు చేరుకుని కొట్టేసిన పర్సును ఇచ్చేశారు. అంతేకాకుండా పర్సులో వంద రూపాయల నోట్లు ఎందుకు పెట్టుకోలేదని చెడామడా వాయించి వెళ్లిపోయారు. దొంగతనానికి గురైన ఆ వ్యక్తి ఓ కార్మికుడు. పేరు వికాశ్ కుమార్. సెక్టార్ ఐషర్ నివాసి. గ్రేటర్‌ నోయిడాలో మంగళవారం రాత్రి పని పూర్తిచేసుకుని రాత్రి 11 గంటలప్పుడు తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పర్సును కొట్టేశారు. అందులో మూడు రూ.500 నోట్లు ఉన్నాయి. బస్టాండ్‌కు చేరుకుంటుండగా పర్సు చోరీకి గురైందన్న విషయాన్ని గుర్తించాడు. వెంటనే సాయం కోసం పోలీసులను ఆశ్రయించాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఆశ్చర్యకరంగా దొంగలు తిరిగి తనవైపు రావడం చూశాడు. ‘‘నా వంక ఆగ్రహంగా చూస్తూ పర్సు విసిరేశారు. ‘‘అందులో వందనోట్లు పెట్టుకోవడం తెలీదా?’ అని అరుస్తూ నా చెంపపై కొట్టి వెళ్లిపోయారు’’ అని వికాశ్ పేర్కొన్నాడు. బాధితుడు తమను ఆశ్రయించడంతో స్నాచర్ల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News