: తల బద్దలు కొట్టుకున్నా కొత్తనోట్లను పాక్ కాపీ చేయడం సాధ్యం కాదు.. స్పష్టం చేసిన ఇంటెలిజెన్స్
పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న రూ.2 వేలు, రూ.5 వందల నోట్లను కాపీ చేయడం అసాధ్యమని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. పాకిస్థాన్, అది ప్రేరేపిస్తున్న ఉగ్రవాద సంస్థలు ఈ నోట్లకు నకిలీలు సృష్టించడం అసాధ్యమైన పని అని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా), ఇంటెలిజెన్స్ బ్యూరో, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)లు కొత్తనోట్లను అన్ని రకాలుగా పరిశీలించాయి. అందులోని సెక్యూరిటీ ఫీచర్లను పూర్తిస్థాయిలో విశ్లేషించారు. అయితే ఆ నోట్లలో ఎన్ని సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయన్న విషయాన్ని వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. భారత కరెన్సీకి నకీలీలు ప్రింట్ చేసేందుకు పాకిస్థాన్ ఏకంగా పెషావర్లో ప్రింటింగ్ ప్రెస్నే ఏర్పాటు చేసింది. అక్కడ రూ.500, రూ.1000 నోట్లను మాత్రమే ముద్రిస్తున్నారు. ఇక్కడ ప్రింటైన నకిలీ కరెన్సీని పాక్ గూడఛార సంస్థ అయిన ఐఎస్ఐ.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కరే తాయిబా, ఇతర ఉగ్రవాద సంస్థలకు అందిస్తుంది. వారి ద్వారా బారతదేశంలోకి వాటిని చొప్పించేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనేది పాక్ దుష్ట పన్నాగం. కొన్నేళ్ల క్రితం పాకిస్థాన్ తన ప్రింటింగ్ మెషీన్లను ఆధునికీకరించింది. ఫలితంగా ఒక్క పొరపాటు కూడా లేకుండా ‘జీరో ఎర్రర్’తో భారత్ కరెన్సీకి నకిలీలను అచ్చుగుద్దుతోంది. ప్రతి ఏడాది భారత్లో రూ.70 కోట్ల నకిలీ నోట్లు ప్రవేశిస్తున్నట్టు అంచనా.