: అమెరికాకి హాటెస్ట్ ఫస్ట్ లేడీ దొరికింది: ట్రంప్ విజయంపై వర్మ కామెంట్
ఊరందరిదీ ఒకదారైతే ఉలిపిరికట్టెది మరోదారి అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పదేపదే నిరూపిస్తుంటారు. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన స్పందించిన తీరు చూస్తే ఎవరైనా ఇలాంటి అభిప్రాయానికి రావాల్సిందే. ట్రంప్ విజయం గురించి వర్మ ట్విట్టర్ లో కామెంట్ చేస్తూ... ట్రంప్ గురించి హేయంగా మాట్లాడిన వాళ్లు ఇప్పటికైనా ఎదగడం నేర్చుకోవాలని ఆయన సూచించారు. అమెరికా ప్రజలే కాదు, ప్రపంచమంతా ఆయనను గుర్తించుకుంటుందని అన్నారు. 'నా ఎత్తు 5.8 అడుగులు. కానీ నేను 6 అడుగులు పైబడిన వారిని, నా కంటే తెల్లగా ఉన్నవారిని ఇష్టపడతాను. ప్రఖ్యాత పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ తో సహా నల్లవాళ్లలో తెల్లవారిగా మారాలనుకున్న చాలామంది నాకు తెలుసు. అదే సమయంలో తెల్లవారెవరైనా నల్లగా మారాలని కోరుకున్నారో లేదో నాకు తెలియదు. మిగిలిన వారిలా ఈ విషయం చెప్పడానికి నేను ఈగోయిస్ట్ ను కాను. నిజాన్ని ధైర్యంగా అంగీకరిస్తాను. హిల్లరీ క్లింటన్ గెలిస్తే ఇప్పుడున్నట్టే ఉంటుంది. కొత్తగా ఏమీ జరగదు. అదే ట్రంప్ గెలిస్తే ఎప్పుడు ఏమి జరుగుతుందోననే టెన్షన్ ఒకటి ఉంటుంది. అలాగే మూస పద్ధతికి భిన్నంగా వ్యవహరించే వాళ్లంతా సక్సెస్ అవుతారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, దివంగత నేత ఎన్టీఆర్, ఇప్పుడు ట్రంప్.. వీళ్లంతా మూసపద్ధతికి భిన్నంగా వెళ్లినవాళ్లే. ట్రంప్ గెలుస్తారని నేనెప్పుడో చెప్పాను. ట్రంప్.. అబ్రహాం లింకన్, రూస్ వెల్ట్, జాన్ కెనడీ తదితరులందిరినీ మించిపోతారు. అమ్మాయిల గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన 60 ఏళ్ల వ్యక్తిని గెలిపించడం చూస్తుంటే... మనిషి ఆలోచనా ధోరణి అభివృద్ధి చెందినట్టుగా నాకు అనిపిస్తోంది. గత అధ్యక్షులు జార్జి వాషింగ్టన్ నుంచి ఒబామా వరకు చూస్తే అమెరికాకు హాటెస్ట్ ఫస్ట్ లేడీ దొరికింది. గతంలోని ఫస్ట్ లేడీల కంటే ప్రస్తుత ఫస్ట్ లేడీ అంటే నాకు ఇష్టం. ఇందుకు నా కారణాలు నాకున్నాయి" అన్నారు వర్మ. చివర్లో తనకు ఆమె ఎందుకు నచ్చిందో ఎవరైనా చెప్పగలరా? అని వర్మ తన అభిమానులను ప్రశ్నించాడు. ట్రంప్ విజయంతో ఒబామా, మిచెల్లి ఒబామా ముఖాలు మరింత నల్లబడి ఉంటాయని ఎద్దేవా చేశాడు.