: ట్రంప్ విజయానికి కారణం ఇదే: ఆరిజోనా రిపబ్లికన్ పార్టీ ఈడీ అవినాష్
డొనాల్డ్ ట్రంప్ ను అమెరికన్లు విశ్వసించారని ఆరిజోనా రిపబ్లికన్ పార్టీ ఈడీ అవినాష్ తెలిపారు. ట్రంప్ విజయంపై భారతీయుడు, తెలుగువాడైన అవినాష్ మాట్లాడుతూ, ట్రంప్ అధ్యక్షుడు కావడం చైనా, పాకిస్థాన్ లకు శరాఘాతమని అన్నారు. భారత్ కు ఎలాంటి నష్టం ఉండదని ఆయన పేర్కొన్నారు. భారత్ పట్ల ట్రంప్ కు ఎలాంటి వ్యతిరేకత లేదని, భారత్ అంటే ట్రంప్ కు అభిమానమని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ట్రంప్ చాలా కామెంట్లు చేసి ఉండచ్చని, అయితే అధ్యక్షుడైన తరువాత మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయని ఆయన తెలిపారు. అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ కి, అధ్యక్షుడు ట్రంప్ కి మధ్య వ్యత్యాసం చాలా ఉంటుందని ఆయన అన్నారు. ఇమ్మిగ్రేషన్ వంటి అంశాలు, కీలక నిర్ణయాలు కాంగ్రెస్ చేతిలో ఉంటాయని ఆయన తెలిపారు. మెజారిటీ అభ్యర్థుల నిర్ణయాలే అమెరికాలో అమలవుతాయని ఆయన చెప్పారు. ప్రచారంలో ట్రంప్ ఏనాడూ కొత్త హామీలు గుప్పించలేదని అన్నారు. తానేం చెప్పారో వాటినే వివరించారని, కొత్త అంశాల జోలికి వెళ్లలేదని అన్నారు. అన్నింటికంటే హిల్లరీకి ఈ మెయిల్స్ విషయంలో ఎఫ్బీఐ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని అమెరికన్లు జీర్ణించుకోలేకపోయారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం వెలువడడం పట్ల అమెరికన్లు అనుమానించారని, అందుకే ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయని ఆయన చెప్పారు.