: రజనీ, కమల్, నాగార్జున.. ట్వీట్లకు పేరుపేరునా స్పందించిన మోదీ
దీపావళి పండగ మర్నాడు చెత్తను ఊడ్చేసినట్లుగా మన దేశం నుంచి నల్లధనాన్ని ఊడ్చేస్తానంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సంచలన నిర్ణయంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ స్టార్లు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు మోదీని అభినందిస్తూ తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా ట్వీట్లు చేశారు. మోదీకి ట్వీట్ చేసిన వారిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ నటులు కమలహాసన్, నాగార్జున, బాలీవుడ్ దర్శకుడు కరణ్ జొహర్, టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే తదితరులు ఉన్నారు. అయితే, వీరందరికి పేరుపేరునా మోదీ ధన్యవాదాలు చెప్పారు. ‘హ్యాట్సాఫ్ నరేంద్ర మోదీ జీ. కొత్త భారతదేశం ఆవిర్భవించింది’ అన్న రజనీ ట్వీట్ కు.. ‘థ్యాంక్యూ. అవినీతి రహిత భారతదేశం కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేసి, ఉజ్వల భారతావనిని నిర్మిద్దాం’ అని, ‘సాల్యూట్ మిస్టర్ మోదీ. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ నచ్చే నిర్ణయమిది. ముఖ్యంగా నిజాయతీగా పన్ను చెల్లించేవారికి’ అని కమల్ ట్వీట్ చేయగా.. ‘బెటర్ ఇండియా కావాలని కోరుకుంటున్న నిజాయతీపరులైన మన పౌరుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాము’ అన్నారు. ‘కంగ్రాట్స్ నరేంద్ర మోదీ జీ !! పన్ను చెల్లించే మాలాంటి వారిని సత్కరించినందుకు, సూపర్ ఎకానమీ దిశగా భారత్ అడుగులు వేస్తోంది’ అని ప్రముఖ నటుడు నాగార్జున చేసిన ట్వీట్ కు..‘ డియర్ నాగార్జున.. ఈ నిర్ణయం వల్ల అవినీతి, నల్లధనం, నకిలీ కరెన్సీ చలామణి తగ్గుతుంది’ అని, ‘గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోదీ భారీ గుగ్లీ బౌల్ చేశారు. వెల్ డన్ సార్, ప్రౌడాఫ్ యు!!’ అని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే చేసిన ట్వీట్ కు..‘ భారత దేశ అత్యంత స్ఫూర్తిదాయక క్రికెటర్లు, ఎవరైతే తమ బౌలింగ్ ద్వారా బ్యాట్స్ మన్ ను ఆశ్చర్యపరిచారో వారి నుంచి వచ్చిందే ఇది’ అంటూ మోదీ స్పందించారు. కాగా, బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జొహర్, రితేష్ దేశ్ ముఖ్, మధుర్ భండార్కర్, కైలాశ్ సత్యార్థి తదితరులు చేసిన చేసిన ట్వీట్లకు కూడా మోదీ స్పందించారు.