: డొనాల్డ్ ట్రంప్ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది!
సరిగ్గా 24 గంటల క్రితం డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారో ఇప్పుడదే జరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనకు మీడియా నుంచి ఎంతమాత్రమూ మద్దతు లేనప్పటికీ, మీడియా సహా పోల్ సంస్థలన్నీ ఆశ్చర్యపోయేలా ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని, రాబోయే ఫలితాలతో మీడియా అవాక్కవుతుందని ఆయన అన్నారు. చివరి ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తూ, వైట్ హౌస్ లో కాలు పెట్టేది తానేనని, స్వింగ్ రాష్ట్రాలన్నింటిలో రిపబ్లికన్లు ఆధిక్యంలో ఉన్నారని కూడా అన్నారు. ఇప్పుడా వ్యాఖ్యలు నిజమయ్యాయి. ట్రంప్ బిజినెస్ మైండ్ గెలిచింది. ఆయన నోటి దురుసు ఎలా ఉన్నా, అమెరికన్ల మనసులకు ట్రంప్ చేరువయ్యారు. తానొస్తేనే ఉగ్రవాదం తగ్గుతుందని, కొత్త ఉద్యోగాలు వస్తాయని, వలసలు తగ్గుతాయని నమ్మించారు. విజయ తీరాల దిశగా సాగుతున్నారు. నిన్న ట్రంప్ ఏం చెప్పారో ఇప్పుడదే జరిగింది. ఫాక్స్ న్యూస్, సీఎన్ఎన్, బీబీసీ, వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్ సహా ఎన్నో ప్రసిద్ధ వార్తా, మీడియా సంస్థలు తామేసిన అంచనాలన్నీ తప్పయినట్టు తేలడంతో, ఎక్కడ తప్పులో కాలేశామన్న విషయాన్ని తేల్చేందుకు కదులుతున్నాయి.