: అద్భుతం జరిగితేనే హిల్లరీకి చాన్స్... 95 శాతం గెలిచేది ట్రంపే!
భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 5 గంటలకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు మొదలు కాగా, ఆ సమయంలో 85 శాతం విజయావకాశాలు హిల్లరీకి ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. సమయం గడుస్తున్న కొద్దీ అమెరికన్లు మార్పునే కోరుతున్నారన్న సంకేతాలు వెలువడుతుండగా, శ్వేతసౌధానికి ఒక్కో అడుగూ దగ్గరగా జరుగుతున్నారు ట్రంప్. ప్రస్తుతం మొత్తం 438 చోట్ల ఫలితాల సరళి వెలువడగా క్లింటన్ 210 స్థానాల్లో ట్రంప్ 228 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ధనిక రాష్ట్రాలైన కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా, హయావ్, మసాచుసెట్స్, వెర్మాంట్, ఓరెగాన్, వాషింగ్టన్ తదితర రాష్ట్రాల్లో హిల్లరీ గెలువగా; వ్యవసాయం, పరిశ్రమలు అధికంగా ఉండే, రెండు డకోటా రాష్ట్రాలు, నెబ్రాస్క్, కన్సాస్, టెక్సాస్, ఓక్లహామా, లూసియానా, అర్కన్సాస్, జార్జియా తదితర రాష్ట్రాల్లో ట్రంప్ విజయం దిశగా దూసుకెళుతున్నారు. స్వింగ్ రాష్ట్రాలైన ఓహియో, ఫ్లోరిడాల్లో ఆయన విజయంతో 95 శాతం మేరకు ట్రంప్ విజయావకాశాలు మెరుగుపడగా, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప హిల్లరీకి చాన్స్ ఉండకపోవచ్చని నిపుణులు వ్యాఖ్యానించారు.