: ఇది నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం!
ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని సర్జికల్ స్ట్రయిక్స్ ను తలపించేలా ఎలాంటి లీకేజ్ లేకుండా హఠాత్తుగా ప్రకటించడంతో ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురైంది. నల్లధనం అరికట్టడంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశ ప్రజలంతా అంగీకరిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రభుత్వానికి కొమ్ముకాసే కార్పొరేట్లు దీనిని ఏ విధంగా తీసుకుంటాయి? అదే సమయంలో ప్రభుత్వంలో భాగమైన అవినీతి ఉద్యోగులు, కోట్లకు కోట్లు పోగేసిన అవినీతి రాజకీయనాయకులు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోగలరా? అన్నది కాస్త సందేహమే. అయితే తాజా నిర్ణయంతో ప్రధాని మోదీ ఇమేజ్ అమాంతం ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయింది. విదేశాల్లోని బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని తీసుకొస్తానని చేసిన ఎన్నికల వాగ్దానాన్ని ఈ రకంగా ప్రధాని నెరవేర్చుకోవడం గుడ్డిలో మెల్లగా భారతీయులు భావిస్తారు. చిన్న మంచి చేస్తేనే ఎంతో గొప్పగా భావించే భారతీయులు, తమ సేవలను వినియోగించుకుని చూస్తుండగానే కుబేరులుగా మారుతూ, నల్లధనంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని లోబర్చుకుంటున్న వారి పీచమణిచే విషయంలో ప్రధానిని అభినందిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ నిర్ణయం నల్ల కుబేరుల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం.