: కాయ్ రాజా కాయ్...హిల్లరీ, ట్రంప్ లపై బెట్టింగ్ బంగార్రాజుల హల్ చల్
కాయ్ రాజా కాయ్...పదికి వంద, వెయ్యికి పదివేలు, పదివేలకు లక్ష రూపాయలు, లక్షకు పది లక్షలు, పది లక్షలకు కోటిరూపాయలు.. ఇదేదో జాతర్లో జరిగే బెట్టింగ్ అనుకునేరు. అస్సలు కానేకాదు. అమెరికా కాబోయే అధ్యక్షుడిపై జరుగుతున్న బెట్టింగ్. లక్షలు, కోట్లలో సాగుతున్నట్టు తెలుస్తోంది. అమెరికాలోని చుట్టాలు, స్నేహితులు, తెలిసినవారికి ఫోన్ చేసి మరీ బెట్టింగ్ లలో పాలుపంచుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఈ బెట్టింగ్ జోరుగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే మూడో కంటికి అనుమానం రాకుండా ఆన్ లైన్ వేదికగా తతంగం మొత్తం జరిగిపోతున్నట్టు సమాచారం. విజయవాడ కేంద్రంగా సాగుతున్న బెట్టింగ్ లో కోట్లకు కోట్లు చేతులు మారుతున్నాయన్నట్టు తెలుస్తోంది. బెజవాడలోని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, నేతలు కూడా ఈ బెట్టింగుల్లో పాలుపంచుకుంటున్నారు. దీంతో బెజవాడలో రేపు సాయంత్రానికి భారీ ఎత్తున డబ్బు చేతులు మారుతుందని తెలుస్తోంది.