: సూర్యాపేట కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేసిన టీజీవీపీ ఆందోళనకారులు.. తీవ్ర ఉద్రిక్తత
సూర్యాపేట కలెక్టరేట్ వద్ద ఈ రోజు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన తెలుపుతున్న టీజీవీపీ (తెలంగాణ విద్యార్థి పరిషత్) కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వారిని నెట్టేసి కార్యాలయంలోకి ప్రవేశించారు. ఆగ్రహంతో కలెక్టర్ ఛాంబర్లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఆఫీసులో ఫర్నీచర్‌ను ధ్వంసం చేసిన ఘటనపై జాయింట్ కలెక్టర్ మండిపడ్డారు. ఇదో హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. మరోవైపు అక్కడ ఆందోళన జరిపేందుకు వస్తోన్న ఆందోళనకారులపై తాము పోలీసులకు ముందుగానే చెప్పామని, పోలీసులు తమకు బందోబస్తు కల్పించడంలో అసమర్థత కనబరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.