: హే నాగ్, 10 జన్మల పాటు నీకు రుణపడి ఉంటా: రామ్ గోపాల్ వర్మ
రూ. 340 కోట్ల బడ్జెట్ తో 'న్యూక్లియర్' అనే అంతర్జాతీయ సినిమాను తీయబోతున్నట్టు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రామ్ గోపాల్ వర్మకు పలువురు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు అందుతున్నాయి. తాజాగా అక్కినేని నాగార్జున కూడా స్పందించారు. అంతర్జాతీయ ప్రాజెక్టును వర్మ చేపట్టడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. మమ్మల్నందర్ని గర్వంగా ఫీల్ అయ్యేలా చేయాలంటూ వర్మను ట్విట్టర్లో కోరారు. నాగార్జున ట్వీట్ కు రామ్ గోపాల్ వర్మ కూడా రిప్లై ఇచ్చాడు. "హే నాగ్, ఒక అనామకుడిని అయిన నాకు శివ సినిమా ద్వారా బ్రేక్ ఇచ్చావు. అంటే, నా మీద నాకున్న నమ్మకం కంటే, నా మీద నీకున్న నమ్మకమే ఎక్కువ అనే విషయం అర్థమవుతోంది. 10 జీవిత కాలాల పాటు నీకు రుణపడి ఉంటా" అంటూ ట్వీట్ చేశాడు.