: స్మగ్లింగ్ దెబ్బ... తక్కువ ధరకు బంగారం దొరుకుతున్న వేళ, ఏడేళ్ల కనిష్ఠానికి జారిపోయిన డిమాండ్!
విదేశాల నుంచి చౌక ధరకు బంగారాన్ని అక్రమంగా ఇండియాకు తీసుకువచ్చి, మార్కెట్ ధరకన్నా తక్కువకు విక్రయాలు జోరుగా సాగిస్తున్న వేళ, బంగారం డిమాండ్ ఏడేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడు బంగారం దిగుమతి 24 శాతం వరకూ తక్కువగా నమోదు కావచ్చని, ధరలు అధికంగా ఉండటంతో పాటు స్మగ్లింగ్ ఎన్నడూ లేనంత స్థాయికి పెరగడం ఇందుకు కారణమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగిస్తున్న దేశాల్లో రెండో స్థానంలో ఉన్న భారత్ లో ఈ సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో 441.2 టన్నుల బంగారం దిగుమతి అయిందని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 29 శాతం తక్కువని డబ్ల్యూజీసీ ఇండియా ఆపరేషన్స్ ఎండీ పీఆర్ సోమసుందరమ్ వెల్లడించారు. గత సంవత్సరం 858.1 టన్నుల బంగారం దిగుమతి అయిందని గుర్తు చేసిన ఆయన, 2009 తరువాత డిమాండ్ తగ్గడం ఈ సంవత్సరమే చూస్తున్నామని అన్నారు. ఈ ఏడు 650 నుంచి 750 టన్నుల వరకూ దిగుమతి నమోదు కావచ్చని అంచనా వేశారు. వివిధ దేశాల నుంచి స్మగ్లింగ్ రూపంలో బంగారం తెస్తున్న అక్రమార్కులు దాన్ని తక్కువ ధరలకు విక్రయిస్తున్నారని మంగళవారం నాడు డబ్ల్యూజీసీ విడుదల చేసిన నివేదికలో తెలిపింది.