: బీజేపీ సీనియర్ నేత అద్వానీని కలిసిన ప్రధాని మోదీ, అమిత్ షా
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్.కె అద్వానీ ఈ రోజు 88వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. దీంతో న్యూఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ మనకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారని మోదీ పేర్కొన్నారు. అద్వానీ పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు అద్వానీని కలిసిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆయనకు పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అద్వానీ, మోదీ, అమిత్ షా కాసేపు చర్చించారు. అద్వానీ నవంబరు 8, 1927లో కరాచీలో జన్మించారు. బీజేపీ అగ్రనేతల్లో ఒకరిగా ఎదిగారు. 1998-2004 మధ్య కాలంలో హోం శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే, 2002-2004 మధ్య కాలంలో భారత ఏడవ ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు.