: తమ్ముడు, మరదలిని రెండో అంతస్తు నుంచి తోసేసిన అక్క... మరదలు దుర్మరణం
ప్రస్తుత సమాజంలో డబ్బుకున్న విలువ దేనికీ లేదనే విషయాన్ని ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోంది. ఆస్తికోసం అక్కాతమ్ముళ్ల మధ్య నెలకొన్న వివాదం, చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, స్థానిక ఐడీహెచ్ కాలనీలో చందు, అతని భార్య జయశ్రీలు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చందు ఉంటున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉమ్మడి ఆస్తి కావడంతో... దాని కోసం అతనికి, అతని అక్క మీరాబాయికి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, నిన్న రాత్రి మీరాబాయి తన కుమారుడు చింటు, కుమార్తె కీర్తి, అల్లుడు బబ్లూలతో కలసి చందు ఇంటికి వచ్చింది. వీరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆవేశం పట్టలేక చందు, జయశ్రీలను వీరంతా కలసి రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశారు. పైనుంచి ఏదో పడిన శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా, తీవ్రంగా గాయపడ్డ చందు, జయశ్రీలు కనిపించారు. స్థానికులు వారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ జయశ్రీ మృతి చెందింది. చందు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.