: వైట్ హౌస్ ఫైట్: నేటి సాయంత్రం పోలింగ్ ప్రారంభం.. రేపు మధ్యాహ్నానికి తుది ఫలితం


యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని గంటల్లో తెర లేవనుంది. భారత కాలమానం ప్రకారం నేటి సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నానికి అగ్రరాజ్యం కొత్త ప్రెసిడెంట్ ఎవరినేది తేలిపోతుంది. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ రేపు ఉదయం ఏడు గంటల వరకు కొనసాగుతుంది. అయితే రాష్ట్రాల మధ్య కాలమానంలో తేడాల వల్ల పోలింగ్ సమయంలో రెండు మూడు గంటలు అటూ ఇటుగా ఉంటుంది. రేపు తెల్లవారుజాముకల్లా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తవుతాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఉదయం 5 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అదే సమయంలో ఎన్నికలపై పలు సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ప్రకటిస్తారు. రేపు మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితం వెలువడుతుంది. మొత్తం 12 కోట్ల మంది అమెరికన్ ఓటర్లు డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 3.7 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించుకున్నారు. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి. అధ్యక్ష పీఠం అధిష్టించాలంటే అభ్యర్థులు 270 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ప్రతిరాష్ట్రం నుంచి ఓటర్లు తమకు నచ్చిన ఎలక్టోరల్‌కు ఓటు వేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అసలు ప్రక్రియ మొదలవుతుంది. ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికైన అభ్యర్థులు దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జనవరి 2, 2017న విజేతను ప్రకటిస్తారు. ఎన్నికైన అధ్యక్షుడు జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తారు. అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం నిర్వహించడంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఆధిక్యం ఇద్దరి మధ్య దోబూచులాడడంతో చివరి వరకు ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. ఈమెయిల్ వివాదంలో ఎన్నికలకు ఒక్కరోజు ముందు హిల్లరీకి ఎఫ్‌బీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో కాస్త వెనకబడిన ఆమె మళ్లీ దూసుకెళ్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో పూర్తిస్థాయిలో భద్రత కల్పించారు. కాగా ఎన్నికల్లో హిల్లరీకి విజయం తథ్యమని సర్వేలు చెబుతున్నాయి. మొత్తం 538 ఓట్లలో హిల్లరీకి 292 ఓట్లు వస్తే, ట్రంప్‌కు 245 ఓట్లు వస్తాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News