: ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ముసుగులో ఘరానా మోసం.. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో రఫెల్స్ మిలీనియం ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ పై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... ప్రియాంక అనే విద్యార్థిని హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ లో గల రఫెల్స్ మిలీనియం ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ లో ఫ్యాషన్ డిజైనింగ్ లో 2014-16 సంవత్సరాలకు విద్యనభ్యసించేందుకు జాయిన్ అయింది. జాయినింగ్ సందర్భంగా కోర్సు ఫీజు కింద మొదటి విడతలో 2.8 లక్షల రూపాయల చెల్లించింది. అనంతరం రెండో ఏడాది విద్యపూర్తి చేసేందుకు 15.7 లక్షల రూపాయల కళాశాల ఫీజుతోపాటు హాస్టల్ ఫీజుగా మరో 2.4 లక్షల రూపాయలు చెల్లించింది. ఇలా ఫీజుల రూపంలో భారీ మొత్తాన్ని దండుకున్న యాజమాన్యం మరో ఏడాది విద్య మిగిలి ఉండగానే కోర్సును నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో విద్యాసంవత్సరం పూర్తవుతున్న దశలో కోర్సును అర్థాంతరంగా నిలిపేయడమేంటంటూ ప్రియాంక తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లి కాలేజీ యాజమాన్యాన్ని నిలదీసింది. దీంతో ఆమెకు సరైన సమాధానం చెప్పని కళాశాల యాజమాన్యం, ఆమెను దుర్భాషలాడుతూ, ఆ ముగ్గురినీ బయటికి గెంటేసింది. దీంతో వారంతా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రఫెల్స్ మిలీనియం ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీ మోసంపై ఫిర్యాదు చేశారు. తమ భవిష్యత్ ను నాశనం చేశారని, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పేరుతో మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 406, 420, 506 లను అనుసరించి రఫెల్స్ మిలీనియం ఇంటర్నేషనల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు ప్రారంభించారు.