: మోదీని తిట్టించాలని టీడీపీ చూస్తోంది: భూమన
భారత ప్రధాని నరేంద్ర మోదీని తమ చేత తిట్టించాలని టీడీపీ ప్రభుత్వం చూస్తోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఉదయాన్నే ఓ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి తమ అధినేత జగన్ పై విమర్శలు కురిపిస్తున్నారని... విశాఖ సభలో మోదీని ఎందుకు తిట్టలేదని ప్రశ్నించారని... మోదీని తిట్టకపోతే టీడీపీ అంగీకరించే పరిస్థితిలో లేదనే విషయం దీని ద్వారా స్పష్టమవుతోందని చెప్పారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాటం చేసిన విషయం మరచిపోయారా? అని ప్రశ్నించారు. స్పెషల్ స్టేటస్ కోసం ఎవరితో తలపడేందుకైనా వైసీపీ సిద్ధమని చెప్పారు. విశాఖలో వైసీపీ నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందని భూమన మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించినా... సభను ప్రజలు విజయవంతం చేశారని చెప్పారు. ఈ సభ ద్వారా ప్రజలు తమ ఆవేదనను తెలిపారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజల్లో జగన్ చైతన్యం తీసుకొస్తున్నారని చెప్పారు. విశాఖ సభ విజయవంతం కావడాన్ని టీడీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.