: భారత బలగాల కదలికలపై పాక్ ఆరా.. జమ్ముకశ్మీర్ వాసులకు ఫోన్‌కాల్స్
భారత సైనిక కార్యకలాపాలపై పాకిస్థాన్ కూపీ లాగే పనిలో పడింది. సైనికాధికారుల పేరుతో సరిహద్దు గ్రామాల ప్రజలకు ఫోన్లు చేసి మరీ వివరాలు సేకరించేందుకు ప్రయత్నించింది. ప్రజలు అప్రమత్తం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పీవోకేలో భారత సర్జికల్ దాడుల తర్వాత జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్‌లోని మొబైల్ కంపెనీలు జారీ చేసిన సిమ్ కార్డులతో సరిహద్దు గ్రామాల ప్రజలకు ఈ ఫోన్లు వచ్చాయి. ఓ పత్రిక నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఆ ప్రతిక కథనం ప్రకారం.. తాము ఢిల్లీలోని సైనిక ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని తమనుతాము పరిచయం చేసుకునేవారు. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైన్యం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసేవారు. అనంతరం సరిహద్దులో బలగాల కదలికల గురించి అడిగేవారు. చెప్పని వారిని తిట్టి పోసేవారు. దీంతో అనుమానించిన స్థానికులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు అప్రమత్తమై ఆర్మీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫోన్ కాల్స్ పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు ఆర్మీ అధికారులు గుర్తించారు. పంజాబ్, లడఖ్ ప్రాంతాలకు ఇటువంటి ఫోన్ కాల్స్ ఎక్కువగా వచ్చినట్టు అధికారులు తెలిపారు. గుర్తింపు లేని సిమ్‌కార్డులతో ఐఎస్ఐ గూఢచారులే ఈ పనిచేసి ఉంటారని పేర్కొన్నారు. దీంతో సరిహద్దుల వెంట జామర్లను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు.