: భార్య మృతదేహంతో కాలినడకన 60 కి.మీ. ప్రయాణించిన భర్త.. డబ్బుల్లేక చక్రాల కుర్చీలో శవంతో ఇంటికి!


అనారోగ్యంతో మృతి చెందిన భార్యను సొంతూరుకు తీసుకెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వలేని ఓ వ్యక్తి ఆమె మృతదేహంతో 60 కిలోమీటర్లు నడిచిన హృదయ విదారక ఘటన హైదరాబాద్ నడిబొడ్డున చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం మాఝుకోడ్‌కు చెందిన రాములు(53), కవిత(45) భార్యాభర్తలు. ఇద్దరూ కుష్టు వ్యాధి బాధితులే. బతుకు తెరువు కోసం ఉన్న ఊరును వదిలిన వారు కొంతకాలంగా కర్ణాటకలోని బీదర్‌ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. హైదరాబాద్‌లోని మౌలాలిలో ఉన్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఒకటి ప్రతినెలా యాచకులకు ఐదు కిలోల బియ్యం ఇస్తుందని తెలుసుకున్న దంపతులు శుక్రవారం రాత్రి బీదర్ నుంచి షిర్డీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి లింగంపల్లిలో దిగారు. ఉదయం మౌలాలి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా భార్య కవిత అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచింది. కళ్లముందే భార్య చనిపోవడంతో రాములు కన్నీరుమున్నీరుగా విలపించాడు. భార్య మృతదేహానికి సొంతూరులోనే అంతక్రియలు నిర్వహించాలని అనుకున్నాడు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. దీంతో ఓ యాచకుడిని అడిగి చక్రాలున్న తోపుడుబండిని తీసుకున్నాడు. దానిపై భార్య మృతదేహాన్ని ఉంచి మాఝుకోడ్‌కు బయలుదేరాడు. అలా 60 కిలోమీటర్లు బండిని తోసుకుంటూ వికారాబాద్ చేరుకున్నాడు. వికారాబాద్ వాసులు కొందరు గమనించి రాములను ఆరా తీశారు. విషయాన్ని పోలీసులకు చేరవేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న సీఐ రవి.. రాములు అంగీకరిస్తే మృతదేహాన్ని ఇక్కడే ఖననం చేస్తామని చెప్పారు. దీనికి రాములు అంగీకరించలేదు. సొంతూరులోనే అంత్యక్రియలు నిర్వహిస్తానని చెప్పడంతో అక్కడున్న వారు తలా కొంత సాయం చేశారు. సీఐ రవి.. స్వామి వివేకానంద సేవా సమితి అంబులెన్స్ ద్వారా వారిని సొంతూరుకు పంపే ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో రాములు అంబులెన్సులో సొంతూరు చేరుకున్నాడు.

  • Loading...

More Telugu News