: నా అనుభవమంత లేదు, నీ వయసు.. నువ్వా, నన్ను విమర్శించేది?: జగన్‌పై చంద్రబాబు ఫైర్
తన అనుభవమంత వయసు కూడా లేని ఓ నాయకుడు తనను విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో శనివారం పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఇటీవల ఓ నాయకుడు కర్నూలు వచ్చి నన్ను విమర్శించారు. నా అనుభవమంత లేదు నీ వయసు. నువ్వా నన్ను విమర్శించేది?’’ అంటూ జగన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కేంద్రంతో రాజీ పడ్డానని అంటున్నారని, దేనికి రాజీపడాలని ప్రశ్నించారు. ‘నా ప్రాణాలకే భయపడలేదు. నీకు భయపడతానా? తండ్రిని అడ్డంపెట్టుకుని దోచుకున్న , ఆ అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన వారు విమర్శిస్తే చూస్తూ ఊరుకోను’’ అని ఘాటు హెచ్చరికలు చేశారు. వైసీపీకి అధికారం వచ్చి ఉంటే కర్నూలు నగరాన్ని ఏదో ఒక దేశానికి అమ్మేసి ఉండేవారని అన్నారు. ఉన్మాదుల సభకు విద్యార్థులను పంపి వారి భవిష్యత్తును నాశనం చేయవద్దని తల్లిదండ్రులకు సూచించారు. విద్యతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు తమ ప్రభుత్వం విద్యకే అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. టీడీపీ అధికారంలో ఉండడానికి కార్యకర్తలే కారణమని, వారి సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.