: కాంగ్రెస్ పార్టీకి సోనియా, రాహుల్ ఎలాగో టీడీపీకి చంద్రబాబు, లోకేశ్‌బాబు అలాగే: రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎలాగో టీడీపీకి చంద్రబాబు, లోకేశ్‌బాబు అలాగేనని టీటీడీపి నేత రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీకి అమిత్ షా, సమాజ్ వాదీ పార్టీకి ములాయం సింగ్ యాదవ్ అధ్యక్షులుగా ఉన్నట్లే తమ పార్టీకి చంద్రబాబు నాయుడు అధ్యక్షుడుగా ఉన్నారని ఆయన చెప్పారు. ఆంధ్రకు చెందిన వ్యక్తి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నానంటూ తనపై పలువురు నేతలు రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తాను తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేయాలని అనుకోవడం లేదని, రైతుల సమస్యలను తెలుసుకొని వారి సమస్యలను తెలియచెప్పడానికే చేయాలనుకుంటున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీకి ఉపయోగపడే క్రమంలో అన్ని పార్టీల నాయకులు ప్రయత్నాలు చేస్తుంటారని, కేసీఆర్ అయినా తానయినా తమ సొంత పార్టీనే బలంగా ఉండాలనే అనుకుంటామని చెప్పారు. కేసీఆర్ ను నమ్మి మోసపోయిన ప్రజలు ఇప్పుడు కళ్లు తెరుస్తున్నారని అన్నారు. టీడీపీలో కార్యకర్తలే నాయకులని, కార్యకర్తలను నేతలుగా చేసే సత్తా టీడీపీకి ఉందని, తమ పార్టీలో ఎంతో మంది కార్యకర్తల స్థాయి నుంచి నాయకులుగా ఎదిగారని ఆయన చెప్పారు.