: కేసీఆర్ అమరావతికి వెళ్లి బిర్యాని ఎందుకు తినొచ్చారు?: రేవంత్ రెడ్డి
ప్రజల్ని కొంత కాలం మాత్రమే మోసం చేయగలుగుతారని, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అందర్ని అన్ని సార్లు మోసం చేయొచ్చని అనుకుంటున్నారని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్ర, తెలంగాణ అనే పదాలకు కాలం చెల్లిపోయిందని, వాటిని ఉపయోగిస్తూ కేసీఆర్ ఇంకా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీకి ఆంధ్రపార్టీ అని ముద్ర వేయాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారని, మరి కేసీఆర్ అమరావతికి వెళ్లి బిర్యాని ఎందుకు తినొచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదని ఎవరెన్ని ప్రచారాలు చేసుకున్నా తమ పార్టీ పుంజుకుంటుందని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేసినప్పుడల్లా ప్రజలు ఊగిపొవడానికి సిద్ధంగా లేరని చెప్పారు. తనను అభిమానించేవారు తాను టీడీపీలో ఉంటే నష్టపోతానని అనుకోవచ్చు కానీ, తాను ప్రజలవైపు పోరాడడానికే పార్టీలో ఉన్నానని చెప్పారు. తెలంగాణలో తమపార్టీ పుంజుకుంటుందని, టీడీపీ గతంలోనూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని, టీడీపీలో చీలికవచ్చిన ప్రతిసారి మళ్లీ నిలిచి తమ పార్టీ గెలిచిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీల అమలులో కేసీఆర్ సర్కారు విఫలమయిందని చెప్పారు. కేసీఆర్ డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకుంటూ భజన కొట్టించుకుంటున్నారని అన్నారు. తమ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమణతో తనకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. కొందరు తమ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారని, అధికారం కోసం టీడీపీ పనిచేయదని ప్రజా సమస్యలపైనే పనిచేస్తుందని అన్నారు.