: ఐఎస్ పని ఖతమేనా? చక్రబంధంలో ఉగ్రవాద సంస్థ.. అబూబకర్‌కు చివరి రోజులు?
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ పని ఇక అయిపోయినట్టేనా? ఉగ్రవాదుల ఆట ముగిసినట్టేనా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇరాక్, సిరియాల్లో మకాం వేసి పలు ప్రాంతాలను తన అధీనంలో పెట్టుకున్న ఐఎస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీకి రోజులు దగ్గర పడడం చూస్తుంటే ఐఎస్ ఖేల్ ఖతమైనట్టేనని స్పష్టమవుతోంది. అమెరికా సేనలతో కలిసి మోసుల్ స్వాధీనమే లక్ష్యంగా ముందుకు కదిలిన ఇరాకీ సేనలు ఆ దిశగా విజయంవైపు అడుగులేస్తున్నాయి. మోసుల్‌లోని పలు జిల్లాలను ఇప్పటికే తమ అధీనంలోకి తెచ్చుకున్న బలగాలు ఐఎస్ చీఫ్‌ను అంతమొందించడమే లక్ష్యంగా సమరోత్సాహంతో ఉన్నాయి. బాగ్దాదీ కనుక హతమైతే ఇక ఐఎస్ కుప్పకూలినట్టేనని భావిస్తున్నారు. సంయుక్త సేనల ధాటికి తట్టుకోలేని ఉగ్రవాదులు ఇప్పటికే తలోదిక్కు పారిపోతుండగా కొందరు మాత్రం పోరాడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరు గడ్డాలు తీసేసి పౌరుల్లో కలిసి పోతున్నారు. ఇక ఐఎస్ ముష్కరుల చెర నుంచి బయటపడిన జిల్లాల ప్రజలు ఆనందంతో రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఐఎస్ చీఫ్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదని, అంతమొందించి తీరాల్సిందేనని ఇరాక్ బలగాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. ఇప్పటికే వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం ఆ కార్యాన్ని కూడా పూర్తిచేసి మోసుల్కు స్వేచ్ఛ ప్రసాదించాలని భావిస్తోంది.