: ఇవెక్కడి ఎన్నికలు?.. ట్రంప్, హిల్లరీలు ఇద్దరికీ పాలించే సత్తాలేదు.. అమెరికన్ల పెదవి విరుపు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది? ప్రపంచం మొత్తం ఆసక్తిగా చర్చించుకుంటున్న ఈ ఎన్నికలపై అమెరికన్లు మాత్రం పెదవి విరుస్తున్నారు. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంతగా అభ్యర్థుల దూషణ పర్వాలు, సెక్స్ స్కాంలు, ఆరోపణలతో తాము విసిగిపోయినట్టు అమెరికా పౌరులు పేర్కొనడం ఎన్నికలపై వారికున్న అయిష్టాన్ని బయటపెట్టింది. ఈ ఎన్నికలపై వారు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని న్యూయార్క్ టైమ్స్/సీబీఎస్ న్యూస్ పోల్ సర్వేలో వెల్లడైంది. హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ నిజాయతీపరులు కారని, వారిద్దరికీ అమెరికాను పాలించే సత్తా లేదని అమెరికన్లు పేర్కొన్నారు. విద్వేష పూరిత ప్రసంగాలతో రెచ్చగొడుతున్న వారు దేశాన్ని ముందుకు తీసుకెళ్లలేరని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం ఆసక్తి కంటే విరక్తిని పెంచిందని ప్రతి పది మందిలో 8 మంది చెప్పుకొచ్చారు. కాగా ఈ పోల్‌లో ఎక్కువమంది హిల్లరీ వైపే మొగ్గు చూపారు. 45 శాతం మంది డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీకి జై కొట్టగా 42 శాతం మంది రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు మద్దతు తెలిపారు. మహిళా ఓటర్లు హిల్లరీకే మద్దతుగా నిలిచారు. మహిళా ఓటర్లలో ట్రంప్ కంటే హిల్లరీ 14 పాయింట్లతో ఆధిక్యంలో ఉండగా, పురుష ఓటర్లలో ట్రంప్ 11 శాతం ముందంజలో ఉన్నారు. హిల్లరీ, ట్రంప్ గురించి ఇప్పుడు సంచలన విషయాలు వెల్లడైనా ఎవరికి ఓటు వేయాలన్న తమ అభిప్రాయాన్ని మార్చుకోబోమని ప్రతి 10 మందిలో ఆరుగురు తేల్చి చెప్పారు.