: ఒబామా నోట తొలిసారి... పోరు హోరాహోరీయే!
తన తదుపరి అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్, డొనాల్ట్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఆయన నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడం ఇదే తొలిసారి. గత వారం రోజుల వ్యవధిలో ట్రంప్ గణనీయంగా పుంజుకున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సాధ్యమైనంత ఎక్కువ మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని తన మద్దతుదారులకు సూచించిన ఒబామా, హిల్లరీకి అనుకూలంగా జాక్సన్ విల్లేలో ప్రసంగించారు. హోరాహోరీ పోరు సాగనున్న వేళ, అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలవకుంటే, గత ఎనిమిది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి నిరుపయోగమవుతుందని, ఇంకో ఐదు రోజులు మనసుపెట్టి హిల్లరీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.