: గత 17 ఏళ్లలో ఎన్నడూ కనపడనంత విపరీతంగా కాలుష్యం.. ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న పరిశోధకులు!
ఢిల్లీలో రోజురోజుకీ పెరిగిపోతోన్న కాలుష్యంపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ పరిశోధకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిపోతోన్న కాలుష్యంతో గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ముప్పుతప్పనట్లు కనిపిస్తోందని, వారిని రక్షించడానికి ప్రభుత్వం వెంటనే అత్యవసర చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలుష్యం బారిన పడి మరిన్ని ఆరోగ్య సమస్యలు తెచ్చుకోకుండా జనాలను ఇళ్లనుంచి బయటకు రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశోధకులు వ్యాఖ్యానించడం గమనార్హం. వాతావరణం పూర్తిగా కాలుష్యం బారిన పడిన పరిస్థితి కనపడుతోంటే, మరోవైపు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, వంటి ప్రాంతాల్లో విపరీతంగా వరికుంచెలు తగులబెట్టడం, దీపావళికి బాణసంచా కాల్చడం వంటివి ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతున్నాయని, అవి పొగమంచులను అసాధారణ స్థాయులకి తీసుకెళ్లాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరుపుకున్న దీపావళి పండుగ తరువాత వరి కుంచెలను కాల్చడం ఇంకాస్త అధికమైందని నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ శాటిలైట్ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ అంశంలో స్పందించాలని, ఢిల్లీలో గాలి శుభ్రతకు ప్రయత్నించాలని కేవలం 24 గంటల్లోనే 200 పైగా పిటిషన్లు నమోదయ్యాయని చేంజ్.ఆర్గ్ తెలిపినట్లు తెలిపింది. ఢిల్లీలో కాలుష్య ఉపశమన పథకాలు అమలులోకి తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని, లేదంటే ప్రజల ఆరోగ్యం మరింత చెడిపోక తప్పదని హెచ్చరించారు. తీసుకోకపోతే, ఈ శీతాకాలంలో పొగమంచు మరింత పెరిగి, ప్రజల ఆరోగ్యానికి మరింత హానికరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా కలుషితమైన ఈ గాలిని పీల్చితే ఒక్క రోజులో 40 సిగరెట్లు తాగడంతో సమానమని చెప్పారు. నిన్న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అక్కడ దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ 400 నుంచి 500 మీటర్స్గా ఉందని అధికారులు తెలిపారు. గత 17 ఏళ్లలో కనపడనంత విపరీతంగా ఈ పరిస్థితి ఉందని చెప్పారు