: వివాదాలు ఎన్నున్నా బేఫికర్.. 14న తెలంగాణ కొత్త సచివాలయానికి కేసీఆర్ శంకుస్థాపన?
కొత్త సచివాలయ నిర్మాణంపై వివాదాలు, వాదనలు చుట్టుముడుతున్నా వాటిని పట్టించుకోకుండా ముందుకే వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈనెల 14న కార్తీక పౌర్ణమి రోజున కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. కోర్టు కేసులు తేలిన తర్వాత నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సచివాలయంలో గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయమై చర్చించినట్టు సమాచారం. సచివాలయ తరలింపును కోర్టు వ్యతిరేకించకపోవడంతో తరలింపు ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. తొలి దశలో ఏ,బీ, సీ బ్లాకులను తర్వాత డీ బ్లాకును కూలగొట్టనున్నారు. ఈలోగా ఏపీ సచివాలయ భవనాలు కూడా తమ చేతికి వస్తాయని తెలంగాణ సర్కారు భావిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 24 ఎకరాల విస్తీర్ణంలో రూ.380 కోట్లతో విశాలమైన సచివాలయం రూపుదిద్దుకుంటుంది. మరోవైపు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఈనెల 20లోగా ప్రభుత్వానికి అప్పగిస్తామని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ వెల్లడించారు.