: తన మొత్తం ఆస్తిని రైతులు, సైనికులకు ఇస్తూ పూణె వాసి వీలునామా.. భార్య, కుమార్తెల మద్దతు!
ఓ వ్యక్తి తన మొత్తం ఆస్తిని రైతులు, సైనికుల సంక్షేమానికి ధారాదత్తం చేశారు. తన సంపదలో 30 శాతం చొప్పున సైన్యానికి, ప్రధాని, ముఖ్యమంత్రి సహాయ నిధులకు, మిగిలిన పదిశాతం సమాజసేవకు పరితపిస్తున్న ఐదు స్వచ్ఛంద సంస్థలకు దక్కేలా వీలునామా రాశారు పుణెకు చెందిన ప్రకాశ్ కేల్కర్(73). ఈ మేరకు గురువారం ఆయన ప్రకటించారు. జౌళి రంగ నిపుణుడిగా బహుళజాతి సంస్థల్లో పనిచేసి రిటైరైన ఆయన తన యావత్ సంపదను పేదలు, సైనికుల సంక్షేమానికి ఇస్తున్నట్టు ప్రకటించిన తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 2013లో తనకీ ఆలోచన వచ్చిందని, తన భార్య, తాను కలసి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్న కేల్కర్ ఈ విషయమై ప్రధాని కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వశాఖలను సంప్రదించినట్టు తెలిపారు. తన కుమార్తెలు ఇద్దరూ ఇప్పటికే స్థిరపడ్డారని, తన నిర్ణయానికి వారి మద్దతు కూడా ఉందని వివరించారు.