: అత్యాచార బాధితురాలికి దారుణమైన ప్రశ్నలతో నరకం చూపించిన పోలీసులు
సామూహిక అత్యాచారానికి గురై ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్న ఆ అభాగ్యురాలి (32)కి అంతకంటే ఎక్కువ నరకం చూపించారు ఖాకీలు. వివరాల్లోకి వెళ్తే, కేరళలోని తిరువనంతపురంకు 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిశూర్ లో ఆమెపై ఆమె భర్త స్నేహితులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె భర్త ఆసుపత్రిలో ఉన్నాడని నమ్మబలికి, ఆమెను బయటకు తీసుకెళ్లి నలుగురు వ్యక్తులు సామూహికంగా ఆమెను బలాత్కరించారు. అత్యాచారానికి పాల్పడ్డ నలుగురిలో ఒక నిందితుడు రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది. జరిగిన అఘాయిత్యానికి సంబంధించి, తన భర్త సూచన మేరకు ఆగస్టులో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత వరుసగా నాలుగు రోజుల పాటు ఆమెను పోలీస్ స్టేషన్ కు పోలీసులు పిలిపించుకుని, ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్ లోనే ఉంచుకున్నారు. అంతేకాదు, దారుణమైన ప్రశ్నలతో ఆమెకు నరకం చూపించారు. ఆమెను తీవ్ర ఒత్తిడికి గురి చేసి, చివరకు కేసును ఉపసంహరించుకునేలా చేశారు. ఈ దారుణ ఉదంతం ప్రముఖ డబ్బింగ్ కళాకారిణి భాగ్యలక్ష్మి ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతాన్ని ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో... అది విపరీతంగా షేర్ అయింది. చివరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో, ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. విచారణ జరిపి, కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఎంవో ప్రకటించింది. బాధితురాలు, ఆమె భర్త ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. పోలీసులు తమను ఎలా వేధించారో మీడియా ముఖంగా వెల్లడించారు. "నిన్ను రేప్ చేసిన వారిలో ఎవరు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చారు?" అంటూ ఓ పోలీసు అధికారి తనను ప్రశ్నించాడని మీడియాతో మాట్లాడుతూ ఆమె కన్నీటిపర్యంతం అయింది. ముఖాలకు ముసుగులు వేసుకొని భార్యాభర్తలిద్దరూ మీడియాతో తమ బాధను పంచుకున్నారు.