: సీపీఎం మధును అరెస్టు చేసిన పోలీసులు.. పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన నిరసనకారులు.. ఉద్రిక్తత
తూర్పుగోదావరి జిల్లాలోని తొండంగి మండలం దానవాయిపేటలో ఈ రోజు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును అరెస్టు చేశారు. దివీస్ ఫార్మాకి వ్యతిరేకంగా సీపీఎం కార్యకర్తలు, స్థానికులు ఈ రోజు నిర్వహించతలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సభ నిర్వహించితీరుతామని ప్రకటించిన మధు కొద్దిసేపటి క్రితం అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీపీఎం శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వివాదం జరిగింది. పోలీసుల తోపులాటలో ఓ మహిళ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మధుతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి తొండంగి పోలీసుస్టేషన్‌కి తరలించారు. దీంతో నిరసనకారులు పోలీసుస్టేషన్‌ని ముట్టడించారు.