: ఒడిశాలో కలకలం.. మాజీ సర్పంచ్ ను కాల్చి చంపిన మావోయిస్టులు
ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టులు బంద్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించినప్పటికీ ఒడిశాలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఒడిశాలో ప్రజలు స్వచ్ఛందంగానే బంద్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో, ఒడిశాలోని త్రిలోచనాపూర్ బ్లాక్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. భవానీపట్నంలో మాజీ సర్పంచ్ జయంత్‌ను దారుణంగా కాల్చి చంపారు. కొద్ది సేపటి క్రితం మొత్తం 30 మందికి పైగా మావోయిస్టులు అక్కడకు చేరుకొని రోడ్డు పక్కన కూర్చున్న మాజీ సర్పంచ్‌ని కాల్చి చంపినట్లు సమాచారం. అనంతరం మావోయిస్టులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.