: మరో రెండేళ్లు భారత ర్యాంకు మారబోదన్న ఎస్ అండ్ పీ... మోదీ సర్కారు ఎదురుదాడి!
భారత సార్వభౌమ రేటింగ్ ను, పెట్టుబడులపై తమ దృక్పథాన్ని ఇప్పట్లో మార్చుకోబోమని గ్లోబల్ రేటింగ్ ఏజన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ ప్రకటించిన నేపథ్యంలో, ఈ ప్రకటనను మోదీ సర్కారు తీవ్రంగా ఖండించింది. వాస్తవ పరిస్థితిని తెలుసుకోకుండానే ఎస్ అండ్ పీ ఈ వ్యాఖ్యలు చేసిందని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకోవాలని సూచించింది. అమెరికా కేంద్రంగా సేవలందిస్తున్న రేటింగ్ ఏజన్సీ ప్రస్తుతం ఇండియాపై 'ట్రిపుల్ బీ మైనస్' (స్టేబుల్) దృక్పథ రేటింగ్ ను కొనసాగిస్తోంది. జీడీపీలో రుణాల మొత్తం 60 శాతం కన్నా తక్కువకు తీసుకురావడంలో ప్రభుత్వం మరింతగా చర్యలు చేపట్టాలని సూచించింది. సమీప భవిష్యత్తులో ఎగుమతి, దిగుమతి లోటు తగ్గే సూచనలు లేదని ఎస్అండ్ పీ పేర్కొంది. కాగా, ఎస్అండ్ పీ చేసిన వ్యాఖ్యలను ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శశికాంత్ దాస్ ఖండించారు. ఆసియాలో మూడవ అతిపెద్ద ఎకానమీగా ఉన్న ఇండియాలో సంస్కరణలు సైతం వేగంగా అమలవుతున్నాయని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలిగేలా, మరిన్ని ఉద్యోగ సృష్టి జరిగేలా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని అన్నారు. గత రెండేళ్లలో పలు ప్రాజెక్టులు మొదలయ్యాయని, ఇవన్నీ వృద్ధి రేటు ముందడుగు వేసేందుకు సహకరిస్తాయని తెలిపారు. భారత రేటింగ్ వాస్తవానికి అనుగుణంగా లేదన్నది అంతర్జాతీయ ఇన్వెస్టర్ల అభిప్రాయమని వివరించారు.