: ఆర్కే తమ వద్ద లేడన్న ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు విచారణ రెండు వారాలకు వాయిదా
ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఇటీవలే జరిగిన భారీ ఎన్కౌంటర్ అనంతరం తన భర్త ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆయనను కోర్టు ముందు ప్రవేశపెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆర్కే భార్య శిరీష గత నెల 31న హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ ప్రారంభించిన హైకోర్టు ఆర్కే అంశంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రోజు పోలీసులు ఈ అంశంపై వివరణ ఇస్తూ, ఆర్కే తమ దగ్గర లేడని చెప్పారు. పోలీసుల అదుపులోనే ఆర్కే ఉన్నాడని మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి రెండు వారాల్లో ఆధారాలు సమర్పిస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో కోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.