: 11 అంతస్తుల మౌలివాక్కం భవనాన్ని 10 సెకన్లలో కూల్చేశారు.. చూసేందుకు ఎగబడిన స్థానికులు
చెన్నై శివారులోని మౌలివాక్కం ప్రాంతంలో నిర్మించిన 11 అంతస్తుల భవనాన్ని సీఎండీఏ అధికారులు కూల్చివేశారు. 2014 జూన్‌లో మౌలివాక్కంలో నిర్మాణంలో ఉన్న ఒక 11 అంతస్తుల భవనం కుప్పకూలి ఏపీకి చెందిన కార్మికులు సహా 61 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ భవనంపై సుదీర్ఘ విచారణ చేపట్టిన అధికారులు ఆ భవనం పక్కన ఉన్న మరో 11 అంతస్తుల భవనం పటిష్టంగా లేదని చెప్పడంతో తాజాగా ఈ భవనాన్ని కూడా కూల్చివేశారు. ఈ భారీ భవనాన్ని కూల్చివేసేటప్పుడు చుట్టుపక్కల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న అధికారులు.. భవనం చుట్టూ 100 మీటర్ల దూరంలో ఉన్న గృహాలను ఖాళీ చేయించి, వారిని ఉచిత బస్సులో మదనంతపురంలోని జైమారుతి మహల్‌కు తరలించారు. అధికారులు భవనంలోని స్తంభాల్లో పేలుడు పదార్థాలను నింపి పనిని పూర్తి చేశారు. కేవలం పది సెకన్లలో ఈ భవనం కూలిపోయింది. ఈ భవనాన్ని కూల్చివేసే దృశ్యాన్ని చూసేందుకు నిన్న తెల్లవారు జామున స్థానికులు సమీప భవనాలపై గంటల తరబడి నిరీక్షించి వీక్షించారు. భవనం సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాల, మూడు ప్రైవేటు పాఠశాలలకు అధికారుల ఆదేశాల మేరకు యమాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. భవన కూల్చివేత దృశ్యాన్ని చూసేందుకు వంద మీటర్ల పరిధి తర్వాత ఉన్న భవనాలపైకి జనం భారీగా చేరుకొని ఆసక్తిగా తిలకిస్తూ తమ సెల్ఫోన్లలో బంధించుకున్నారు. భవనం కూలిపోతుండగా తీసిన దృశ్యాలను ట్విట్టర్లో ఓ యాష్ ట్యాగ్(#moulivakkam) సృష్టించి పెట్టారు. భవనం కూల్చి వేతకు ముందు.. కూల్చిన తరువాత అని వీడియోలు, ఫొటోలు పోస్టులు చేస్తున్నారు.