: అసలైన బిచ్చగాళ్లను గుర్తిస్తాం.. నకిలీ బిచ్చగాళ్లను ఏరేస్తాం: మేయర్ బొంతు


హైదరాబాద్ లో అసలైన బిచ్చగాళ్లను గుర్తిస్తామని, నకిలీ బిచ్చగాళ్లను ఏరేస్తామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. యాదాద్రి- భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ లోని అమ్మా-నాన్న అనాథాశ్రమాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ‘బిచ్చగాళ్లు లేని హైదరాబాద్’ కార్యక్రమం కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ ఆశ్రమం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని హైదరాబాదులో చేపట్టనున్నట్లు చెప్పారు. గత కొన్ని నెలలుగా హైదరాబాదులో నిర్వహించిన సర్వే ప్రకారం, 10 వేల మందికి పైగా బిచ్చగాళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే, వీళ్లలో కొద్దిమంది మాత్రమే అసలైన బిచ్చగాళ్లన్న విషయం తెలిసిందన్నారు. డ్రగ్స్ విక్రయించేవారు, అమ్మాయిలను వేధించే వాళ్లు కూడా బిచ్చగాళ్ల రూపంలో చెలామణి అవుతున్నారన్నారు. పసిపిల్లలకు నార్కోటిక్స్ లాంటి మత్తుమందులు ఇచ్చి వారిని చంకనేసుకుని బిచ్చమెత్తుకునే వాళ్లు కూడా ఉన్నారని ఈ సందర్భంగా చెప్పారు. హైదరాబాద్ లో అసలైన బిచ్చగాళ్లను గుర్తించి వారికి పునరావాసం కల్పిస్తామని, నకిలీ బిచ్చగాళ్లను వారి స్వస్థలాలకు పంపుతామని బొంతు రామ్మోహన్ చెప్పారు. ‘బిచ్చగాళ్లు లేని హైదరాబాద్’ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చిన అమ్మా-నాన్న అనాథాశ్రమం నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఆ ఆశ్రమానికి సహకరిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News