: పోగొట్టుకున్న ఫోను కోసం నాలుగేళ్ల బాలికను బలిచ్చారు
మూఢనమ్మకాల పిచ్చిలో ఉన్న ఓ వ్యక్తి తాను పోగొట్టుకున్న ఫోనుని తిరిగి పొందడం కోసం ఓ నాలుగేళ్ల బాలికను బలి ఇచ్చిన దారుణ ఘటన అసోంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా చరాయ్‌డియో అనే ఆదివాసుల్లోని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వివరాలు వెల్లడించారు. సును గోడ్బా అనే నాలుగేళ్ల బాలిక గత నెల 24న అదృశ్యమైంది. తమ కూతురు కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాప కోసం ఆరాతీస్తుండగా హనుమాన్ భూమ్‌జీ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో చేతులు, మొండెం లేకుండా బాలిక మృతదేహాన్ని గుర్తించారు. హనుమాన్ తన ఇంట్లో క్షుద్రపూజలు చేసినట్లు గుర్తించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం తన ఫోనును పోగొట్టుకున్నానని, దాని కోసం స్నేహితులతో కలసి మాంత్రికుడిని సంప్రదించానని, ఓ పాపను బలిచ్చి పూజ చేస్తే ఫోను దొరుకుతుందని చెప్పడంతో తాము ఈ పనిచేశామని పోలీసుల ముందు నిజాన్ని కక్కాడు. హనుమాన్‌తో పాటు అతడి స్నేహితులని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.