: వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణలకు తొలి ర్యాంకులు... కేసీఆర్ హర్షం


సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణలు సంయుక్తంగా తొలి ర్యాంకు సాధించాయి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ ఈరోజు ఒక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. గత ఏడాది 13వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఈ ఏడాది తొలిస్థానంలో నిలిచేందుకు ప్రభుత్వ విధానాలతో పాటు అధికారుల కృషి కూడా కారణమన్నారు. 340 విభాగాల్లో విధానాల్ని అధ్యయనం చేసిన తర్వాత ర్యాంకింగ్ నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా ఈ విభాగాలను పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. ముఖ్యంగా, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో పారదర్శకత, సింగిల్ విండో విధానం, భూమి లభ్యత, నిర్మాణ అనుమతులు, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రధాన విభాగాల్లో రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలకు అధిక మార్కులు రావడంపై కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోనే సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి, వర్తక, వ్యాపారాలు నిర్వహించాలనుకునే వారికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్ఫూర్తిగా నిలిచాయన్నారు.

  • Loading...

More Telugu News