: పిల్లాడికి ఫెరారీ కారిచ్చిన తండ్రిపై కేసు
ఫెరారీ స్పోర్ట్స్ కారు గంటకు రెండొందల కిలోమీటర్లకుపైనే వేగంగా పరుగులు తీస్తుంది. మామూలు కార్లకంటే ఎంతో పవర్ ఫుల్. కేరళలోని కోచిలో తొమ్మిదేళ్ల కుర్రాడు మాత్రం ఈ స్పోర్ట్స్ కారుతో ఆటలు ఆడుకున్నాడు. ఎంచక్కా ఎక్కేసి తాపీగా నడిపేశాడు. వీధుల్లో రౌండ్లు వేశాడు. అదీ తన తమ్ముడిని పక్క సీట్లో కూర్చోబెట్టుకుని. దీన్ని వాళ్లమ్మ వీడియో తీస్తుంటే వాళ్ల నాన్న ముసి ముసిగా నవ్వుతూ చూశాడు.
ఇప్పుడేమైంది? పోలీసులకు విషయం తెలిసింది. మన దగ్గర మైనర్లు మోటారు వాహనాలు నడపడానికి చట్టాలు ఒప్పుకోవు. చిన్నాడికి స్పోర్ట్స్ కారుచ్చి, చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతని తండ్రి నిషమ్ పై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఫెరారీ కారును స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా ఐశ్వర్యం తెచ్చిన తంటా. నిషమ్ టొబాకో, రియల్ ఎస్టేట్ వ్యాపారి. బాగా ధనవంతుడు. 18 కార్లు అతడి ఇంటి ఆవరణలో పడకేసి ఉంటాయి. ఈ విషయాలను పోలీసులే వెల్లడించారు. సొమ్ములున్నాయి కదాని పిల్లకాయలకు పెద్ద కార్లిచ్చి వారి ప్రాణాలతోపాటు, రోడ్డుపై వెళ్లే మిగతా వారి ప్రాణాలను రిస్క్ లో పడేస్తే ఊరుకోరు కదా?