: చౌకబారు ఉత్పత్తుల విక్రయానికి మంగళం పాడాలనుకుంటున్న చైనా!


తమ దేశంలో తయారయ్యే ఉత్పత్తులు నాణ్యత లేనివని వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవాలని చైనా భావిస్తోంది. చౌకబారు ఉత్పత్తులను ప్రపంచ దేశాల్లో విక్రయించడాన్ని నిలిపివేసి, ప్రపంచ స్థాయి నాణ్యతలతో కూడిన ప్రొడక్టులను పోటీ ధరలకు విక్రయించాలని నిర్ణయించింది. అధికంగా ఉన్న ఉద్యోగులను తొలగించుకోవడంతో పాటు, ఆటోమేషన్ విధానాలను అవలంబించడం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ ఇప్పుడున్న ధరలను పెంచాలని భావిస్తున్నట్టు జియాంగ్ మెన్ లక్ టిష్యూ మాన్యుఫాక్చరింగ్ లిమిటెడ్ డిప్యూటీ డైరెక్టర్ రోజర్ జాహో వెల్లడించారు. ప్రస్తుతం ఇస్తున్న ధరల కన్నా మరింత తక్కువ ధరలకు దిగజారడం తమకు ఇష్టం లేదని, నాణ్యతతో పాటు మరింతగా ధరలను పెంచేందుకే ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. చౌకబారు ఉత్పత్తుల కారణంగా తగ్గుతున్న మార్జిన్లను పెంచుకోవడంపైనే దృష్టిని సారించినట్టు కాంటన్ ఫెయిర్ లో పాల్గొన్న ఆయన తెలిపారు. చైనా సహా ప్రపంచ దేశాల్లో ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిడి నెలకొందని, ద్రవ్యోల్బణం వ్యతిరేక దిశగా పయనిస్తున్న వేళ, చైనాలోని పలు కంపెనీలు వృద్ధి బాటన కొనసాగేందుకు చూస్తున్నాయని సిడ్నీ కేంద్రంగా ఇన్వెస్టర్లకు మూలధన సేవలందిస్తున్న ఏఎంపీ కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ వ్యూహాల విభాగం అధిపతి షేన్ ఓలివర్ అభిప్రాయపడ్డారు. దీని ప్రభావం చైనా నుంచి అధిక మొత్తంలో చౌక ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న పలు దేశాలపై పడనుందని ఆయన అన్నారు. చైనా నుంచి వివిధ దేశాలకు దిగుమతి అవుతున్న పెద్ద స్క్రీన్ టీవీలు, గృహోపకరణాల ధరలు పెరగవచ్చని ఆయన అన్నారు. 2012 నుంచి పోలిస్తే, జపాన్, యూరప్, అమెరికా వంటి పెద్దమార్కెట్ల నుంచి డిమాండ్ 30 శాతం మేరకు తగ్గిందని, ఇదే సమయంలో గడచిన దశాబ్ద కాలంలో కార్మికుల వేతనాలు నాలుగు రెట్లు పెరిగాయని బాత్ రూం ఉపకరణాల ఉత్పత్తి సంస్థ డాంగువాన్ సిటీ క్సిన్ చెన్ సంస్థ వ్యవస్థాపకుడు శాండీ చాంగ్ వ్యాఖ్యానించారు. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న వేళ, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని, మరింత నాణ్యతపైనే తాము దృష్టిని పెట్టామని ఆమె వివరించారు.

  • Loading...

More Telugu News