: నాలుగేళ్ల చిన్నారిని గదిలో బంధించి దారుణంగా కొట్టిన సవతి తల్లి.. విషయం బయటికి తెలియడంతో పరార్
ప్రకాశం జిల్లా దర్శిలో నాలుగేళ్ల బ్రహ్మయ్య అనే చిన్నారిపై సవతి తల్లి తన ప్రతాపం చూపించింది. ఆ బాలుడి ఒంటి నిండా వాతలు పెట్టి రాక్షసిలా ప్రవర్తించింది. ఆ చిన్నారి తండ్రి ఆంజనేయులు రెండో భార్య అయిన లక్ష్మికి బ్రహ్మయ్య తమతో ఉండకూడదని వాదించేది. ఆ బాలుడిపై కోపంతో ఒక గదిలో బంధించి తీవ్రంగా హింసించింది. సవతి తల్లి కొట్టిన దెబ్బలతో ఆ చిన్నారికి తల నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. చివరికి ఇంట్లో నుంచి తప్పించుకున్న ఆ చిన్నారి రోడ్డు పైకి వచ్చాడు. బాలుడిని తీవ్ర గాయాలతో చూసిన స్థానికులు దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ చిన్నారిపై ఉన్న దెబ్బలను చూసిన డాక్టర్లు సైతం ఆశ్చర్యపోవడం గమనార్హం. ఈ విషయం బయటకి తెలియడంతో సవతి తల్లి లక్ష్మీ తన భర్త ఆంజనేయులుతో కలిసి పారిపోయింది.