: జమ్మూలో విద్యాలయాలపై విరుచుకుపడుతున్న నిరసనకారులు... 3 స్కూళ్ల దహనం
హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం, రహదారులపై నిరసనలు, పోలీసులపై రాళ్లు రువ్వడం, వాహనాలకు నిప్పు పెట్టడం వంటి చర్యలతో గత రెండు నెలలుగా అట్టుడుకుతున్న కశ్మీర్ లోయలో నిరసనకారులు మరింతగా రెచ్చిపోతున్నారు. తమ ఆజ్ఞలను ధిక్కరించి పాఠశాలలు తెరుస్తున్నారని ఆరోపిస్తూ, పాఠశాలకు నిప్పంటించారు. 24 గంటల వ్యవధిలో మూడు స్కూళ్లను అగ్నికి ఆహుతి చేశారు. అనంతనాగ్ జిల్లాలోని హయ్యర్ సీనియర్ సెకండరీ పాఠశాలతో పాటు ఇష్ముఖం ప్రాంతంలోని జవహర్ నవోదయా విద్యాలయానికి, మరో ప్రభుత్వ పాఠశాలకు నిప్పంటించారు. దాదాపు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. వేర్పాటువాద సంస్థలు నిరవధిక బంద్ కు పిలుపునిచ్చినప్పటి నుంచి కాశ్మీర్ లోయలో ఎన్నో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో కొన్ని పాఠశాలలను పునరుద్ధరించగా, ఆందోళనకారులు వాటిని దహనం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా, ఈ ఘటనకు పాల్పడిన వాళ్లను ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని విపక్ష నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. పాఠశాలలకు నిప్పంటించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.