: అరెస్టుల భయంతో... తండ్రి అంత్యక్రియలకు జకీర్ నాయక్ డుమ్మా
భారత్ లో అడుగుపెడితే అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో... వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. ఆయన తండ్రి డాక్టర్ అబ్దుల్ కరీం నాయక్ (88) నిన్న తెల్లవారుజామున ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో జన్మించిన డాక్టర్ అబ్దుల్ కరీం మంచి వైద్యుడిగా, విద్యావేత్తగా పేరొందారు. కొన్ని రోజుల క్రితం ఆయనను మజ్ గావ్ లోని ప్రిన్స్ అలీఖాన్ ఆసుపత్రిలో చేర్చారు. నిన్న తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. ఆయన అంత్యక్రియలకు పలువురు రాజకీయనేతలు, పాత్రికేయులు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు హాజరయ్యారు. అయినప్పటికీ, జకీర్ నాయక్ మాత్రం రాలేదు. జకీర్ వస్తాడనే అంచనాతో జాతీయ నిఘా సంస్థ అధికారులు, స్థానిక పోలీసలు, సిటీ క్రైం పోలీసులు అంత్యక్రియలు జరిగే ప్రాంతం చూట్టూ గాలిస్తూనే ఉన్నారు. టీవీలలో తన ప్రసంగాల ద్వారా ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారని, ఉగ్రవాదం వైపు ఆకర్షితులు అయ్యేలా చేస్తున్నారనే ఆరోపణలతో జకీర్ పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ లో సైతం ఆయనపై కేసులు ఉన్నాయి. మనదేశంలో ఆయనపై ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కానప్పటికీ... ఆయన సంస్థ ఇస్లామిక్ రీసర్చ్ ఫౌండేషన్ ను చట్ట విరుద్ధ సంస్థగా ప్రకటించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. తాను భారత్ లో అడుగుపెడితే, తనను అరెస్ట్ చేస్తారనే భయాలు జకీర్ లో బలంగా ఉన్నాయి.