: భోపాల్ సెంట్రల్ జైలులో హెడ్ కానిస్టేబుల్ హత్య... 8 మంది ఉగ్రవాదుల పరార్
నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా)కి చెందిన 8 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు మధ్యప్రదేశ్ లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ గొంతును అత్యంత పాశవికంగా కోసి, హత్య చేసి, వారు ఎస్కేప్ అయ్యారు. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రమాశంకర్ ను హత్య చేసిన అనంతరం, బ్లాంకెట్స్ సహాయంతో ప్రహరీ గోడను ఎక్కి, జైలు నుంచి బయటపడ్డారు. ఈ 8 మంది ఉగ్రవాదులను గతంలో ఒడిశాలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. పరార్ అయిన సిమీ ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముఖ్యంగా భోపాల్ లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లు, జన సమ్మర్ధ ప్రదేశాల్లో వీరి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ, జరిగిన ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపారు. మూడేళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. భోపాల్ కు 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖండ్వా జైలు నుంచి ఏడుగురు సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్నారు. అప్పట్లో, బాత్రూం గోడను బద్దలుకొట్టి, వారు తప్పించుకున్నారు.