: పాక్ మీద మరిన్ని దాడులు చేయాలి: ములాయం సింగ్ చిన్న కోడలు
పీవోకేలో భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులపై సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ స్పందించారు. ఇప్పటికైనా పాకిస్థాన్ దారిలోకి రావాలని... లేకపోతే, మరిన్ని సర్జికల్ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని పెంచి, పోషించడాన్ని పాక్ ఆపేయాలని, సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను ఆపేయాలని, లేకపోతే భారత జవాన్ల మెరుపు దాడులను మరిన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. పాక్ వైఖరి మారుతుందని తాను భావించడం లేదని... ఆ దేశంపై మరిన్ని సర్జికల్ దాడులు జరపాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ సతీమణే అపర్ణా యాదవ్. రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ వ్యతిరేక కూటమిలో ఈమె కూడా భాగస్వామి. భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులపై ఇంతకుముందు అఖిలేష్ స్పందిస్తూ, ఈ తరహా దాడులు గతంలో కూడా జరిగాయిని, తొలిసారిగా తామే చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తోందంటూ ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే, అఖిలేష్ కు భిన్నంగా అపర్ణ స్పందించారు.