: ఢిల్లీలో వాయు కాలుష్యం కమ్మేస్తోంది.. నగరవాసులను ఇల్లు కదలద్దంటున్న అధికారులు!
ఢిల్లీలో వాయు కాలుష్యం ఈ సీజన్ లోనే అత్యధికంగా పెరిగిపోయిన వేళ, ప్రజలను ఇల్లు కదలవద్దని, అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. నగరాన్నంతా పొగమంచు కమ్మేయగా, గాలి వేగం చాలా నెమ్మదిగా, ఒక్కో చోట అసలు కదలికే లేకుండా ఉందని, పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో ఎండిన పంట పొలాలను తగుల బెడుతున్నందునే ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గాలి నాణ్యత తగ్గడానికి కారణం ఇదేనని, దీనికితోడు దీపావళి టపాసులు సైతం కాలుష్యాన్ని పెంచుతున్నాయని వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రజలు దీపావళి పండగకు దూరంగా ఉండాలని రాష్ట్ర పర్యావరణ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీలో ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 2.5 పీఎంగా ఉంది. ఈ స్థాయిలో కాలుష్యాన్ని పీలిస్తే, ప్రజలకు వివిధ రకాల రుగ్మతలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేడు కాలుష్యం మరింతగా పెరిగే అవకాశముందని అంచనా వేశారు.