: అరెస్టును తప్పించుకోండి... రహస్యంగా ఇస్లామాబాద్ రండి: కార్యకర్తలకు ఇమ్రాన్ ఖాన్ సూచన
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ నవంబర్ 2న ఇస్లామాబాద్ లో తలపెట్టిన నిరసన, ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇప్పటికే 600 మందికి పైగా కార్యకర్తలను అరెస్ట్ చేసిన వేళ, మిగతావారు ఎలాగైనా అరెస్టును తప్పించుకుని రహస్య మార్గాల ద్వారా ప్రయాణించి ఇస్లామాబాద్ చేరుకోవాలని ఇమ్రాన్ ఖాన్ సూచించారు. ఇస్లామాబాద్ ముట్టడికి వచ్చే వారు ప్రధాన రహదారులను వదిలివేయాలని తెలిపారు. ప్రజలను ఇస్లామాబాద్ తరలించే దిశగా నేడు వివిధ ప్రాంతాల్లో ర్యాలీలను తలపెట్టినప్పటికీ, అనుమతులు లేకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ వాటిని రద్దు చేసుకున్నారు. రావల్పిండి, ఇస్లామాబాద్ తదితర ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు, పోలీసులకూ మధ్య గొడవలు జరిగాయి. పెషావర్ - ఇస్లామాబాద్ రహదారిపై నిరసనకారులను ఆపేందుకు వంతెనలపై కంటెయినర్లను అడ్డుగా నిలిపారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరు పనామా పేపర్స్ లో ఉన్న నేపథ్యంలో ఆయన తక్షణం రాజీనామా చేయాలని ఇమ్రాన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.